ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు..
అటవీ కార్యాలయాన్ని ముట్టడించిన తుడుందెబ్బ నాయకులు...
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 16 :- ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని నిరసన వ్యక్తం సిర్పూర్ యు అటవీ కార్యాలయాన్ని తుడుం దెబ్బ నేతలు ముట్టడించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా జీవిస్తున్న ఆదివాసీలను నిబంధనల పేరుతో వేధించడం, గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల వంటి మౌలిక వసతుల పనులను అటవీ అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటవీ శాఖ దౌర్జన్యపూరిత వైఖరిని నిరసిస్తూ గురువారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు.
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడి కార్యక్రమానికి తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు కోట్నాక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు మండల కేంద్రంలో సాంప్రదాయ డోల్ వాయిద్యాలు, నినాదాల హోరు నడుమ కొమురం భీం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాల వద్ద నుంచి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు నాయకులు మాట్లాడుతూ అటవీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5వ షెడ్యూల్ ప్రాంతాలలో ఆదివాసీల ఆచారాలు, సంస్కృతి, జీవించే హక్కులకు పూర్తి రక్షణ ఉందని, ఏజెన్సీలో సర్వాధికారాలు ఆదివాసీలకే కల్పించే ల్ టీ ఆ ర్ 1/70 చట్టం, గ్రామసభలను సర్వోన్నతంగా గుర్తించిన పేసా పె స -1996 చట్టాలను అటవీ అధికారులు యథేచ్ఛగా ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు.
ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం సెక్షన్ 3(2) ఉల్లంఘన: అటవీ హక్కుల గుర్తింపు చట్టం ( ఆర్ ఓ ఎఫ్ ఆర్ )-2006 సెక్షన్ 3(2) ప్రకారం గ్రామాభివృద్ధి కోసం రహదారులు, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు, పాఠశాలలు తదితర 13 రకాల మౌలిక వసతులకు అటవీ భూమిని గ్రామసభ ఆమోదంతో ఉపయోగించుకునే హక్కు ప్రజలకు ఉందని, వీటికి అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులు ఆపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.భూసేకరణ, వేధింపులు ఆపాలన్నారు. చట్టం సెక్షన్ 4(5) ప్రకారం భూముల హక్కుల ధ్రువీకరణ పూర్తయ్యే వరకు ఏ ఆదివాసీని భూమి నుంచి తొలగించడానికి వీల్లేదని, సెక్షన్ 3(1)(g) ప్రకారం పంటలను నాశనం చేసినా, భూములు లాక్కున్నా అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సహా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
చిన్న అటవీ ఉత్పత్తులపై అధికారం తునికాకు, ఇప్పపువ్వు, తేనె, వెదురు తదితర అటవీ ఉత్పత్తులను తరలించడానికి ఎలాంటి 'ట్రాన్సిట్ పాస్' అవసరం లేదని, అక్రమంగా సరుకును సీజ్ చేసి కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
అటవీ శాఖ తక్షణమే తన వైఖరిని మార్చుకుని, గ్రామాల్లో ఆగిపోయిన సీసీ రోడ్లు, పేదల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆటంకాలు కలిగించకుండా సహకరించాలని, లేనిపక్షంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రేంజ్ అధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ముఖ్య సలహాదారు డాక్టర్ కనక ప్రభాకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మడవి మధురాజ్, ఉపాధ్యక్షులు ఆత్రం అర్జున్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, జైనూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్ రావ్, లింగాపూర్ మండల అధ్యక్షులు పెందుర్ ప్రకాష్, విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు జంగు, సిర్పూర్ (యు) మండల అధ్యక్షులు కొమురం భీంరావు, వాంకిడి మండల అధ్యక్షులు పంద్రం సురేష్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల సర్పంచ్‌లు, పటేల్‌లు, గ్రామ పెద్దలు, మహిళలు, ఆదివాసీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.
అటవీ కార్యాలయాన్ని ముట్టడించిన తుడుందెబ్బ నాయకులు...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 15 October 2026 08:36 PM
K Prasanna Kumar




