ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి..
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య..
తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 26:-
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు . సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన మొహమ్మద్ గౌస్ పట్టణంలోని కూరగాయల మార్కెట్, బెల్లంపల్లి బస్తీ ప్రాంతాలలో రహదారి, మురుగు కాలువల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రతినిధులు తమ దరఖాస్తులో నా కాఫ్ ఒప్పందం రద్దు చేయాలని, సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలలో సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. దండేపల్లి మండలం మోకాసిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్ జి టి బి.దేవకి తనకు ఇన్ సర్వీస్ బి.ఈడి. చేసేందుకు అనుమతించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని ఎస్.సి. కాలనీవాసులు తమ కాలనీకి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న మట్టి ఇటుక బట్టి వలన కలుగుతున్న వాయు కాలుష్యం,ప్రజారోగ్యం, పర్యావరణ నష్టాలపై సమగ్ర విచారణ జరిపి తగుచర్యలుతీసుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన చెట్టి శ్రీనివాస్ తనకు గురిజాల శివారులో గల భూమిలోకి కొందరు పి ఓ టి చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఆక్రమించుకొని పట్టా పొందారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సల్లూరి దుర్గయ్య గ్రామ శివారులో గల బీడు భూములనువ్యవసాయ భూములుగా చూపించి రైతుబంధు తీసుకుంటున్న విషయంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 66 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, బి.సి. సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా యువజన క్రీడల అధికారి హనుమంత రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బన్సీలాల్, అధికారులతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, వివిధ భాషలలోకి అనువదించబడిన ఈ మహాకావ్యం ఎంతోమందికి సుపరిచితమని తెలిపారు.రామాయణంలోని గొప్ప సందేశాలు, విలువలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలని సూచించారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించుకోవడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహనీయుల గొప్పతనం, వారి జీవిత విశేషాలు భవిష్యత్ తరాలకు తెలుస్తాయని తెలిపారు.మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆదర్శాలను అనుసరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి..
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య..
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 26 October 2026 07:39 PM
K Prasanna Kumar




