ఖైదీలలో మానసిక ప్రవర్తన రావాలి...
 సైకాలజిస్ట్ డాక్టర్ రంగు వేణు కుమార్...
 తెలంగాణ చీఫ్ బ్యూరో కొండపర్తి ప్రసన్నకుమార్ అక్టోబర్ 18:-
ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్  మార్గదర్శకత్వంలో, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రంగు వేణుకుమార్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నారాయణరావు లు శనివారం మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట సబ్ జైలు ప్రాంగణంలో ఖైదీలకు మానసిక ఆరోగ్యం, భావోద్వేగ నియంత్రణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ పరివర్తనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సమాజంలోని అన్ని వర్గాలకు మానసిక ఆరోగ్య అవగాహనను చేరువ చేయాలనే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఆశయం, మార్గదర్శకత్వం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఖైదీలలో సానుకూల ఆలోచనలను పెంపొందించి, వారు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన జీవితాన్ని నిర్మించుకునేలా ప్రేరణ కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రంగు వేణుకుమార్ మాట్లాడుతూp ఆవేశం, కోపం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేసినప్పటికీ, అవే భవిష్యత్తును నిర్ణయించవని పేర్కొన్నారు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవడం ద్వారా కొత్త జీవితానికి పునాది వేసుకోవచ్చని ఖైదీలకు తెలియజేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కుటుంబంలో గౌరవాన్ని తిరిగి పొందుతూ,సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నారాయణరావు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం,ఆత్మనియంత్రణ, సానుకూల ఆలోచనలు అలవర్చుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని వివరించారు. నిరాశకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవరచుకోవాలని ఖైదీలకు సూచించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన లక్షెట్టిపేట జైలు అధికారి తేజావత్ స్వామిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ఖైదీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వారిలో సానుకూల మార్పుకు ప్రోత్సాహం అందించడం వంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. శిక్షతో పాటు ఖైదీలలో మానవీయ విలువలు, ఆత్మపరిశీలన, పరివర్తనకు ప్రాధాన్యతనిచ్చే ఇటువంటి కార్యక్రమాలకు జైలు అధికారుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు.జైలు జీవితం ముగింపు కాదు.. పరివర్తనకు ఆరంభం. గతం నుంచి పాఠాలు నేర్చుకొని,వర్తమానాన్ని మార్చుకొని, భవిష్యత్తును నిర్మించు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రంగ వేణు కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నారాయణరావు, లక్షెట్టిపేట జైలు అధికారి తేజావత్ స్వామి, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.