పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు..
తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 24:-
పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండిఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిమాట్లాడుతూరహదారిప్రమాదాలలో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సహాయం అందించి, ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పి.ఎం. రహత్ పథకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం క్రింద పోలీసుల ఆమోదం పొందిన కేసులలో అర్హులైన రహదారి ప్రమాద బాధితులకు గరిష్ఠంగా 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 7 రోజుల వ్యవధికిసంబంధించిన చికిత్సా సదుపాయం ఉంటుందని, రోడ్డు ప్రమాద వివరాలను నిర్ధారించేందుకు జిల్లా పోలీసులకు 24 గంటల గడువు ఉంటుందని, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0, ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ద్వారా బాధితుల వివరాలు, ప్రమాద వివరాలు, కేసు స్థితిని అనుసంధానించడం జరుగుతుందని తెలిపారు. 112 అత్యవసర సేవలతో అనుసంధానం ద్వారా ప్రమాద బాధితులకు సత్వర వైద్య సహాయం అందించే వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని, బాధితులకు అందించిన చికిత్సకు సంబంధించి ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రహదారి ప్రమాద బాధితుడు నేరుగా ఆసుపత్రిలో చేరినప్పుడు, బాధితుడి వివరాలను టి ఎం ఎస్ వ్యవస్థలో నమోదు చేసి ప్రత్యేక బాధితుడి గుర్తింపు సంఖ్య కేటాయిస్తారని, ప్రమాద స్థలం, బాధితుడి వివరాలను సంబంధిత డి.ఎస్.పి. కార్యాలయం, పోలీస్ స్టేషన్కు పంపిస్తారని, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ప్రమాద స్థలాన్ని, ప్రమాదంలో బాధితుడి ప్రమేయాన్ని పరిశీలించి, ఇప్పటికే నమోదైన ప్రమాద కేసుతో బాధితుడి వివరాలను అనుసంధానిస్తారని తెలిపారు.అవసరమైతే కొత్త ప్రమాద కేసు గుర్తింపు సంఖ్యను రూపొందిస్తారని, అనంతరం ఈ డి ఎ ఆర్ లోని బాధితుడి గుర్తింపు సంఖ్యను టి ఎం ఎస్ బాధితుడి గుర్తింపు సంఖ్యతో అనుసంధానించి, సంబంధితసమాచారాన్ని ఆసుపత్రికి అందిస్తారని తెలిపారు. పథకం అమలులో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ, పోలీస్ శాఖ, ఆసుపత్రులు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తదితర వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయని, పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రహదారి ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడం, చికిత్సా ప్రక్రియను వేగవంతం చేయడం, ఆసుపత్రులు, పోలీసుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో మాట్లాడుతూ పి.ఎం. రహత్ పథకం అమలు విధానంపై సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.పథకానికి సంబంధించిన విధివిధానాలు, బాధితుల వివరాల నమోదు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లాలో పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా, నిర్దేశించిన విధానాలను ఖచ్చితంగా పాటిస్తూ పి.ఎం. రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ, జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, ఈ డి ఎ ఆర్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.

K Prasanna Kumar





