సర్వే నంబర్ 87 ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి.. ఎంఐఎం డిమాండ్
వివాదాస్పద భూమిలో ప్రహరీ గోడ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలి...
 తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 24:-
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 87లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి, అక్కడ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించే ప్రయత్నాలను శాశ్వతంగా అడ్డుకోవాలని ఎంఐఎం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ షకీర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇబ్నీ అఫాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
 అట్టి భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని, 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, ఈ భూమికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని నాయకులు పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నించడంతో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సయ్యద్ ఇబ్నీ అఫాన్ తెలిపారు.దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను స్థల పరిశీలనకు పంపించి నిర్మాణ పనులను నిలిపివేయించినట్లు ఆయన తెలిపారు . తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే ప్రాంతంలో గతంలో, 2026 జూన్ 24న పేద చిరు వ్యాపారులకు చెందిన దుకాణాలను తొలగించారని, దీనివల్ల సుమారు 150 కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడినట్లు నాయకులు పేర్కొన్నారు. మరోసారి వివాదాస్పద ప్రభుత్వ భూమిలో నిర్మాణ ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమి రికార్డులు, 22-ఏ జాబితాలోని వివరాలు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసును పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. చట్టానికి, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరగకుండా తగిన చర్యలుతీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు పేద చిరు వ్యాపారులు, బాధిత కుటుంబాల హక్కులు మరియు జీవనోపాధిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి అని, దాని పరిరక్షణకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహమ్మద్ షకీర్ అహ్మద్, సయ్యద్ ఇబ్నీ అఫాన్ కోరారు.