కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడుతా...
 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ...
 తెలంగాణ చీఫ్ బ్యూరో( కొండపర్తి ప్రసన్నకుమార్) అక్టోబర్ 25 :- కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడడంతోపాటు సంక్షేమ బోర్డు కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తానని పెద్దంపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, కోదండరామ్,ఎమ్మెల్యే విజయరమణారావులతో కలిసి ఆదివారం పెద్దపల్లి లో  హమాలీ వాయిస్ పుస్తక ఆవిష్కరణ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 
కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం పార్లమెంట్‌లో నిరంతరం పోరాటం చేస్తానని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యతే వారి హక్కుల సాధనకు ప్రధాన బలమని పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన సేవలను ఎంపీ గుర్తుచేశారు. కార్మికుల కష్టాలను స్వయంగా తెలుసుకొని, వారి హక్కుల సాధన కోసం కాకా వెంకటస్వామి ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలనే స్ఫూర్తిని కాకా వెంకటస్వామి నుంచి నేర్చుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కాకా వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకులఆశయాలను కొనసాగిస్తూ, కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు.కార్మికుల పెన్షన్ సమస్యపై పార్లమెంట్‌లో అనేకసార్లు ప్రస్తావించినట్లు తెలిపారు. దశాబ్దాలు గడిచినా పెన్షన్ విధానంలో కార్మికులకు తగిన న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. రైల్వే కార్మికులు, ఎఫ్‌టీఐ కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇన్నేళ్లు గడిచినా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు కాకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే అంశంపై కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రికి వ్యక్తిగతంగా వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు, ఉద్యోగుల హక్కులు, పని గంటలు, సంస్థల్లో ఉద్యోగులనియామకాలు, తొలగింపులకు సంబంధించిన నిబంధనలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని గడ్డం వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చట్టాల్లోని అంశాలను పునఃసమీక్షించాలని, ఈ విషయాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు.కార్మికుల కష్టాలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమకు ప్రత్యక్ష అవగాహన ఉందని పేర్కొన్న ఎంపీ, కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడుతా...