తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్ ) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రేగులగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పౌష్టికాహార బియ్యం మరియు నిత్యావసర సరుకుల అక్రమ తరలింపుపై, ఇదివరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాలజిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కు ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ రేగులగూడెం ఆశ్రమ పాఠశాలలో రాత్రి వేళల్లో విద్యార్థులకు చెందిన రేషన్ బియ్యం, సరుకులను దొంగతనంగా బయటకు తరలిస్తున్న దృశ్యాలు సాక్ష్యాలతో సహా బయటపడినా, సంబంధిత జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వార్డెన్, ఉపాధ్యాయులను కాపాడేందుకు సంక్షేమ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదివరకు జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం రాకపోవడంతోనే నేడు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ను కలసి వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని క్రింది డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.సరుకుల దొంగతనానికి పాల్పడిన రేగులగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ మరియు సహకరించిన సిబ్బందిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలన్నారు. ఫిర్యాదు చేసినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి అక్రమార్కులను కాపాడుతున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసు కోవాలన్నారు. ఉన్నత స్థాయి స్వతంత్ర అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని నియమించి, పాఠశాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అక్రమార్కులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి.. పట్టించుకోని సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు ఏఐఎస్బి డిమాండ్...
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: తెలంగాణప్రచురణ తేదీ: 04 October 2026 11:31 AM
enivasnews.com




