తెలంగాణ చీఫ్ బ్యూరో ( కొండపర్తి ప్రసన్నకుమార్) 6:  మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, హౌసింగ్ కార్పొరేషన్ పిడి బన్సీలాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ అధికారి రవీందర్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎ.పి.డి. మోహన్ లతో కలిసి వి బి జి రామ్ జి, ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతలు, పారిశుధ్యం, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, ఇంటి పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వి బి జి రామ్ జి పథకం క్రింద జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ, వి.ఓ., అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మాణం పూర్తైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఐ.హెచ్.హెచ్.ఎల్. చెల్లింపులుపూర్తయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు మంజూరైన 5.50 కోట్ల రూపాయల నిధులను మెటీరియల్ కాంపోనెంట్ క్రింద వినియోగించి, సంబంధిత భవనాల నిర్మాణ వ్యయాన్ని నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 2 బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, జిల్లాలో ఇప్పటికే మంజూరైన 3 వేల 150 ఇంకుడు గుంతలకు మార్కింగ్ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని, మిగిలిన ఇంకుడు గుంతలకుసంబంధించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలనిసూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పండుగలు నిర్వహించే ప్రాంతాలలో ముళ్ల పొదలు, చెట్లు తదితర అవరోధాలు ఉంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులు వాటిని తొలగించిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, హౌసింగ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ లు,సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలి..! అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య