తెలంగాణ చీఫ్ బ్యూరో (కొండపర్తి ప్రసన్నకుమార్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలు కళాశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినిల తో కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ముందస్తు బతుకమ్మ సంబరాలను ఆటపాటల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల, అలాగే మహాత్మ జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు రకరకాల బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ బద్దంగా పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను విద్యార్థులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. మహిళా సాధికరతా విభాగం, ఐక్యుఏసి,కళా సాంస్కృతిక విభాగం, తెలుగు విభాగాల సంయుక్త అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు . తీరొక్క రకాల పూవులనుతీసుకువచ్చి మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు బతుకమ్మలను తయారు చేశారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు.

ఈ సందర్భంగా పలువురు పాఠశాలలు కళాశాలల ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ సంప్రదాయంగా వస్తున్న ఒక గొప్ప సంస్కృతి అని కొనియాడారు. బతుకమ్మలో తెలంగాణ పల్లె జీవితం కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రాధాన్యత మరువలేనిది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో కళాశాల మహిళాఅధ్యాపకులు, అధ్యాపకులు , బోధనేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

enivasnews.com





