పాములపాడు :-భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుంచి తొలగించి ప్రజాస్వామ్య దేశంలో కోల్పోయిన 13 కోట్ల ఓటర్లు తిరిగి ఓటర్‌జాబితాలో పొందుపరచాలని సిపిఎం కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు పాములపాడులోని, బస్టాండ్ సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ నాయకులు ఎస్.బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్.షేక్షాఅలి, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.సికిందర్, ప్రజా సంఘాల నాయకులు నల్లమల అబ్రహం, వామపక్ష నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని, కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తూ, పౌరుల రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నిరసనను చేపట్టడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా కల్పించిన అత్యంత కీలకమైన ప్రాథమిక హక్కు ఓటు హక్కు అని,ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని అన్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి, ఏకపక్షంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లకు పైగా ఓట్లను అక్రమంగా, విచక్షణారహితంగా తొలగించడం అత్యంత దారుణమని, సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు. అదేవిధంగా కోట్లాది మంది ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని కాలరాసే విధంగా సాగుతున్న ఈ కుట్ర వెనుక రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని వారు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఇలాంటి అక్రమ తొలగింపులకు పాల్పడుతోందని, బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన పౌరుల ఓట్లను అర్ధరాత్రికి రాత్రే తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే తీరని కళంకమని, తొలగించిన ప్రతీ ఓటును తక్షణమే పునరుద్ధరించాలని వారు హెచ్చరించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై జరుగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా, ఓటు హక్కు పరిరక్షణ కోసం వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రజలను సమీకరించి, పెద్ద ఎత్తున నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజాశక్తులన్నీ ఒక్కటై ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలయేసు, ఆనంద్, డానియేలు, మాభాష, ప్రజాసంఘాల నాయకులు, సిఐటియు హమాలి యూనియన్ నాయకులు, పాల్గొన్నారు.

enivasnews.com





