నంద్యాల : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు విభాగం ఆధ్వర్యంలో నేడు (అక్టోబర్-7న) ఉదయం 10 గంటలకు నంద్యాల కలెక్టరేట్‌ లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి గణియా మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో అపోలో టైర్స్ లిమిటెడ్‌ (ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌), టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అపోలో టైర్స్‌లో డిప్లొమా, ఐటీఐ (ఎన్‌సీవీటీ తప్పనిసరి), డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశాలు ఉండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. శారీరక ప్రమాణాల్లో కనీసం 163 సెం.మీ. ఎత్తు, 50 కిలోల బరువు ఉండాలని సూచించారు. అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్‌లో మొబైల్‌ అసెంబ్లీ విభాగంలో అసోసియేట్‌ ఉద్యోగాలకు 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు కలిగిన వారు హాజరుకావచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్‌/సీవీ, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువత ముందస్తుగా kaushalam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు అందుబాటులోకి వచ్చిన ఈ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.