నంద్యాల : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పి ఆర్ టి యు) నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని, శ్రీ వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయ నాయకులతో పాటు రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు కలిపి సుమారు 100 మందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డా. గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యకు పరిష్కార మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను దశలవారీగా చెల్లించే దిశగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్లో అహింస, సత్యం, ధర్మం, స్వచ్ఛత, శ్రమ గౌరవం, పని ఆధారిత విద్య, సామాజిక సేవా భావాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు టెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్పెషల్ టెట్‌లో ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యేలా ప్రభుత్వంతో చర్చించి కృషి చేస్తామని పేర్కొన్నారు. 2027 జనవరి నాటికి సంక్రాంతి కానుకగా ఐఆర్ సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు అవసరమైన మార్గదర్శకాల విడుదల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.ఎం.గిరిప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కరుణానిధి మూర్తి, నంద్యాల, ఆత్మకూరు, డోన్ డివిజన్ల ఉప విద్యాధికారులు డి.టి.శంకరప్రసాద్, ఎస్.వెంకటరామిరెడ్డి, పిఆర్టియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.కృష్ణారెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు బి.విశ్వనాథ్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఉపాధ్యాయుల సమస్యలు, సంఘటనా బలోపేతం, విద్యా రంగ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.భార్గవ రామయ్య, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి, విజయరావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్, హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి, పిఆర్టియు నాయకులు రమణయ్య, పి.నూర్ మొహమ్మద్, హనుమంతు, జె.సి.నరసింహులు, జగదీష్ బాబు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల సేవలను, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల ప్రతిభను గుర్తించి ఘనంగా సత్కరించడం ద్వారా ఈ ఆత్మీయ అభినందన సభ ఉపాధ్యాయ లోకంలో ఆనందోత్సాహాలను నింపింది.

రాష్ట్రపతి ఉత్తర్వులతో సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి మార్గం సుగుమం...! ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ