ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతో నూరు శాతం ఫలితాలను సాధించి ఉత్తీర్ణత శాతంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేయాలని, ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి పరీక్షల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో విద్యార్థుల విద్యా బోదనను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం స్థానిక సూర్యారావుపేటలోని, శ్రీ కర్నాటి రామమోహనరావు నగర పాలక సంస్థ పాఠశాలను, పటమటలోని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సమయంలో పదవ తరగతి విద్యార్థులకు రోజువారి స్లిప్ టెస్టును నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ముగిశాక జిల్లా కలెక్టర్ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలిస్తూ గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ కు సంబంధించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాదానాలను రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుండి 11,200, ప్రైవేటు పాఠశాలల నుండి 16,000 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరేందుకు లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారన్నారు.
ఇష్టపడి నేర్చుకున్న విషయ పరిజ్ఞానం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతోమంది ఉన్నత స్థానాలకు ఎదిగారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టమైనా ఇష్టపడి చదివితే సబ్జెక్టు అంశాలు గుర్తుంటాయన్నారు. తమ పిల్లలు తమలా కష్టపడకుండా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సమాజంలో మంచి పేరు తెచ్చుకుని స్థిరపడాలనే ఆశతో ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలేనని ఈ పరీక్ష పాస్ అయితే ఉన్నత చదువులు చదివేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేయాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు అయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారికి అర్థమయ్యే రీతిలో బోధించి ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే పద్ధతి, ప్రశ్నకు సంబంధించి జవాబు వ్రాసే విధానం వంటి విషయాలను విద్యార్థులకు సూచించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో ఉపాధ్యాయులు సెలపులు వినియోగించవద్దన్నారు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు ఉపాధ్యాయులపై తల్లిదండ్రులలో గౌరవం పెంపొందేందుకు దోహదపడతాయన్నారు. 10వ తరగతి ఫలితాలలో జిల్లాను అగ్రగామిగ నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట డిఇవో ఎల్. చంద్రకళ, శ్రీ కర్నాటి రామమోహనరావు, నగర పాలక సంస్థ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.సూర్యప్రభ, గోవిందరాజు, ధర్మ ఈనాం ట్రస్టు ప్రాధానోపాధ్యాయులు మురాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News