ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సుందరయ్య ఆశయ సాధన కోసం అంకితభావంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రమైన పాములపాడు లోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి అందరూ కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ కామ్రేడ్ ఎస్.ఆర్.రమణ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందర్ వెంకట్రామిరెడ్డి నెల్లూరు జిల్లాలోని, అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించి తన భాగానికి వచ్చిన భూములను పేదలకు సిపిఎం పార్టీకి అంకితం చేసి బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసం రెడ్డి అనే పదాన్ని తొలగించి సుందరయ్యగా పేరు నామకరణ చేసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో సిపిఎం పార్టీని నిర్మించడం కోసం కృషి చేశారని ఆయన కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు భూ పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు, దున్నేవానికే భూమి పంచాలని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని తన స్వగ్రామంలో 1934లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని నేడు 16 రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సంఘం పనిచేయడం జరుగుతుందన్నారు, కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి దళితులకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మేకల రాజు, ఎస్.బాలయ్య, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, సోషల్ మీడియా ప్రతినిధి జి.గోవిందు, చెలిమిల్ల నాగరాజు, శ్రీనివాసులు, మహమ్మద్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News