ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద పాత కీప్యాడ్ మొబైల్ ఫోన్లు సేకరిస్తూ, వాటి ద్వారా భారీ ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులు పాత మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిలోని డేటా, సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లు సేకరించి, బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ అమాయక ప్రజలను ఓటిపి లు అడిగి మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకునేవారని విచారణలో వెల్లడైం దన్నారు. స్క్రాప్ మొబైల్ భాగాలను హైదరాబాద్‌లో విక్రయిస్తూ లాభం పొందుతున్నట్లు నిందితులు అంగీకరించినట్టు తెలిపారు. పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు యాక్టివా స్కూటీ - 1, రెండు స్మార్ట్ ఫోన్లు, 20 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, 38 మొబైల్ బ్యాటరీలు, మొబైల్ విడిభాగాలు జప్తు చేశామన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారన్నారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ సూచించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. పాత మొబైల్ ఫోన్లను అమ్మే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలని గుర్తుతెలియని వాళ్ళకి అమ్మ వద్దని తెలిపారు. అదే విధంగా మొబైల్ షాప్ యజమానులు మొబైల్ ను కొనుగోలు చేసే ముందు యజమానుల ధ్రువపత్రాలను మరియు సరైన బిల్లులను సరిచూసుకొని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News