ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యువకులు విదేశాల్లో వచ్చే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ టాంకామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, తెలంగాణ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాల అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏటీసీల ద్వారా 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం 4,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. టాంకామ్ ద్వారా నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తామని, ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురికాకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాల్లో భారతీయులకు మంచి పేరు ఉందని, అక్కడి చట్టాలను గౌరవిస్తూ కష్టపడి పనిచేస్తారని గుర్తుచేశారు. నెలకు ₹2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందుతుందని తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువత టాంకామ్ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.
Admin
E Nivas News