ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న పోలింగ్ లో అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల, దండేపల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాజీపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యతో కలిసి లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మొదటి విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటింగ్, కౌంటింగ్ కొరకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో భాగంగా ఈ నెల 11వ తేదీన జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలో ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి మిగిలిన 81 గ్రామపంచాయతీ సర్పంచ్, 514 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 వేల 600 మంది పోలింగ్ విధులు, 400 పోలీస్ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని, 24 వెబ్ కాస్టింగ్ లొకేషన్ల ద్వారా 200 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఉంటుందని, 20 మంది సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ప్రచారం ముగిసిందని, ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, గత ఎన్నికలలో 85.26 శాతం ఓటింగ్ నమోదు అయిందని, ఈసారి 90 శాతం నమోదు జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మీడియా ప్రతినిధులు అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News