ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోడు భూముల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరిని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రంగా ఖండించారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ పోడు భూముల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా అడవులను ఆనుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు, పేద రైతులు సాగుచేస్తున్న పోడు భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా కుటుంబాల జీవనాధారంగా ఉన్న పోడు భూములను రైతుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం, వారిపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు. అడవుల అభివృద్ధి పేరుతో రైతుల పొట్టకొట్టే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ఏడాది పంటకాలంలో రైతులు భూముల్లో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్న ఘటనలను గుర్తుచేస్తూ, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సాగు చేయలేక అనేక కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయని చెప్పారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడు రైతుల కష్టాలను గుర్తించి వారికి పోడు పట్టాలు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గిరిజనులు, పేద రైతులకు భూమిపై హక్కులు కల్పించేందుకు గత ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు రైతుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయని, ఫారెస్ట్ అధికారులు తరచూ భూముల వద్దకు వెళ్లి రైతులను భయపెడుతున్నారని విమర్శించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారి జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలు చేపట్టడం సరైంది కాదన్నారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని కోనప్ప సూచించారు. తరతరాలుగా సాగుచేస్తున్న రైతులకు శాశ్వత హక్కులు కల్పించి, వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించి, సాగుకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News