ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్) నైపుణ్యాలపై దృష్టి సారించి, ప్రత్యేక పఠన మెరుగుదల ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం, అక్షరాస్యతను అభివృద్ధి చేయాలని అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో గత సంవత్సరంలో పేలవమైన పనితీరును కనబరిచిన పాఠశాలలపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని, రాబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎం.ఈ.ఓ లు మండలంలోని ప్రతి పాఠశాలను ఖచ్చితంగా సందర్శించి ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి, రికార్డు పరంగా అన్ని అంశాలపై చర్చించాలని, విద్యార్థులకు బోధనా పద్దతులను, సందేహాల నివృత్తి, విద్యార్థుల హాజరు శాతం మెరుగుదల వంటి అంశాలపై సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలను రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ప్రతి సబ్జెక్టులో ఉత్తములుగా తీర్చిదిద్దాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడితో శిక్షణ ఇప్పించి విద్యార్థి యొక్క సందేహాలను నివృత్తి చేసి ప్రతిభావంతునిగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లాలో సబ్జెక్టుల వారిగా ప్రత్యేక ప్రతిభా పాఠవాలు కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు భోదించి విద్యార్థుల పఠన సామార్త్యాన్ని పెంచాలన్నారు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అంతకు ముందు సంవత్సరం ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి పాఠశాలపై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను సమయానుకూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News