ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నాణ్యత లేకుండా చెక్ డ్యాంలో నిర్మాణాలు ఎవరి సహకారంతో ఏ మాఫియా కమీషన్ల కోసం నిర్మించారొ విజిలెన్స్ ఎంక్వయిరీలో త్వరలోనే బయటకు వస్తుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరు వద్ద కుంగిపోయిన చెక్ డ్యాంను మంగళవారం శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాసన సభ్యునిగా ప్రతిపక్షంలో ఉండగా చెక్ డ్యాంల నిర్మాణాలతో ఈ ప్రాంతంలోని రైతులకు మేలు జరగడంలేదని శాసనసభలో ప్రశ్నించానని గుర్తు చేశారు. నాణ్యత లేకుండా చెక్ డ్యాంల నిర్మాణాలు చేశారనడానికి పగుళ్లే ఎందుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. చెక్ డ్యామ్ కింది నుండి నీరు పోతుందని దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని గ్రామ పెద్దలు చెప్పిన మాటలు బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చెక్ డ్యాంల నాణ్యత లోపంపై రాజీ పడేదిలేదని, నిర్మాణాలు జరిగిన నాటి నుండి సంఘటన జరిగిన రోజు వరకు ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిర్మాణాలు ఎవరి లాభం కోసం ఎందుకు కట్టారని విషయాన్ని త్వరలో బట్టబయలు చేస్తామన్నారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, విద్యుత్తు సలహా మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Admin
E Nivas News