ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల ట్రిపుల్ ఐటీకి శంఖుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం అనిరుధ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగానే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోమటిరెడ్డి పై వచ్చిన ఆరోపణలు చూసి తాను ఎంతగానో బాధపడ్డానని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని, నీతి నిజాయితీలకు ప్రతీక అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన చరిత్ర ఆయనిదని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే తనకు ఆయన వ్యక్తిత్వం ఏమిటో కూడా బాగా తెలుసు అని చెప్పారు. కోమటిరెడ్డి వెంటకరెడ్డిని శ్రీరామచంద్రుడు అని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డిపై ఆరోపణలు చేసిన మీడియా ఛానల్ కూడా తనకు తెలుసునని ఆ ఛానల్ లో అలాంటి కథనం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై వేసిన సిట్ తన విచారణలో వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తుందని అనిరుధ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. రూ.400 కోట్లతో ట్రిపుల్ ఐటీ నిర్మాణం... కాగా జడ్చర్ల మండల పరిధిలోని చిట్టబోయినపల్లి సమీపంలో రూ.400 కోట్లతో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణం జరగనుందని ఎమ్మెల్యే తెలిపారు. ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలకు శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ ట్రిపుల్ ఐటీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కాకుండా దక్షిణ తెలంగాణ ప్రాంతమంతటికీ వరప్రదానమని అభిప్రాయపడ్డారు. గడతంలో దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గతంలో జైలు నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలోనే ఇప్పుడు ట్రిపుల్ ఐటీ రూపుదిద్దుకోనుందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాంతానికి ఇచ్చిన వరాలలో ట్రిపుల్ ఐటీ కూడా ఒకటని చెప్పారు. జడ్చర్ల ప్రాంతానికి ట్రిపుల్ ఐటీని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలందరి తరుపున అనిరుధ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చిట్టబోయినపల్లి వద్ద శనివారం జరగనున్న జడ్చర్ల ట్రిపుల్ ఐటీ శంఖుస్థాపన, మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభల్లో కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయనపిలుపునిచ్చారు.
Admin
E Nivas News