ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేకనిఘానేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అధికారులతో మంగళవారం దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు జిల్లాలోని పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికలను పూర్తి శాంతియుతంగా, స్వచ్ఛంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి స్థాయి పోలీసు అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్, ఫలితాల అనంతరం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుజరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, రిస్క్ ఎలిమెంట్స్‌పై ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల, పోలీస్ స్టేషన్ వారీగా సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాన కలిగి ఉండాలని, ఎన్నికల రోజు మరియు కౌంటింగ్ రోజున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. విజేత ర్యాలీలపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. మున్సిపల్ ఎన్నికల చట్టాలపై రాష్ట్ర పోలీసు లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు పోలీసు అధికారులకు సమగ్ర లీగల్ అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ అడిగిన ప్రశ్నలకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న భద్రతా చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, పోలీసు బలగాల వినియోగంపై వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, సందీప్ రెడ్డి, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News