ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడం సంబంధిత అధికారుల ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు,ఉపాధి హామీ పథకం, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 68 ఫిర్యాదులు అందాయి.వీటిపై తక్షణ చర్యలు తీసుకుని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని సూచించారు.మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు,శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని, అప్పీల్ కేసులను రెండు నుంచిమూడురోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులతో పాటు డాక్టరేట్ పొందిన కలెక్టరేట్ పరిపాలన అధికారిని జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్.చిత్రు,డీఆర్‌ఓ స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News