ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భట్టి విక్రమార్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల మధ్య, ఖమ్మం జిల్లాలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే మధిరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అలాగే హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో, ఖమ్మంలో మరో ప్రత్యేక క్యాంపు కార్యాలయం అవసరమా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1 కోటి వ్యయంతో క్యాంపు కార్యాలయం నిర్మించగా, ప్రస్తుత నిర్మాణానికి రూ.4.50 కోట్ల ప్రజా ధనం ఖర్చు చేయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భవనం ప్యాలెస్ తరహాలో నిర్మాణం జరుగుతోందని, ఇది ప్రజా ధన వినియోగంలో అసమతుల్యతను సూచిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం, ఖమ్మం జిల్లా తన ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలోనే ఈ నిర్మాణం చేపట్టారని, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఒక రాజకీయ సందేశం ఇవ్వడానికే ఈ భవనం నిర్మాణమని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై అధికారికంగా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలకు నిధుల కొరత ఉందని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో, మంత్రి కోసం భారీ వ్యయంతో భవనం నిర్మాణం చేపట్టడంపై ప్రజల్లో సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే, ఒక మంత్రికి ఇంత భారీ స్థాయిలో క్యాంపు కార్యాలయం నిర్మిస్తే, ఇతర మంత్రులు కూడా ఇలాంటి సదుపాయాలు కోరితే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోందని సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం అధికారిక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Admin
E Nivas News