ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో నియమావళిని పాటించాలని రాష్ట్ర స్థాయి ఎన్నికల పరిశీలకులు పీ మనోహర్ అన్నారు. గురువారం పట్టణంలోని కే ఎస్ ఆర్ ఫంక్షన్ హల్లో మొదటి విడతలో హాజీపూర్, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో జరుగుతున్న ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులందరూ సామరస్య పూర్వకంగా ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని కోరారు.నియమ నిబంధనలు పాటించకపోతే పలు రకాల కేసులు సైతం నమోదు అవుతాయని తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల నియమ నిబంధనల గురించి వివరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్, అదనపు ఎన్నికల అధికారి చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామస్థాయి ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఎన్నికలలో అభ్యర్థులందరూ ఎలాంటి కుల,మత విద్వేషాలకు పోకుండా సామరస్య వాతావరణంలో ఎన్నికలు జరుపుకొని గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.అనంతరం ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజేశ్వర్ మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థికి రూ. లక్ష యాభై వేలు,వార్డు అభ్యర్థికి రూ 30 వేల ఖర్చు చేయడానికి పరిమితి ఉంటుందన్నారు. అభ్యర్థులందరూ దీని దృష్టిలో ఉంచుకొని నూతనంగా తెరిచిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్నికల లావాదేవీలు జరిపి, ఎన్నికల ఖర్చులను మండల స్థాయిలో ఉన్న సహాయ వ్యయ పరిశీలకులకు అందజేయాలన్నారు. అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు జరుపుకోవాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీస్ వారు సూచించి ఇచ్చిన సమయంలోనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ శాఖ సూచనలు గమనించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ అభ్యర్థులకు సంబంధించి సమావేశాలకు గాని, ర్యాలీలకు గాని, లౌడ్ స్పీకర్ల గాని వారు ఉపయోగించే ఒక వాహనానికి కానీ స్థానిక తహసీల్దార్ నుంచి పర్మిషన్ లెటర్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ పర్మిషన్ లకు స్థానిక ఎస్ హెచ్ ఓ నుండి రికమాండ్ అయిన తరువాతనే తహశీల్దార్ పర్మిషన్ ఇస్తారని సూచించారు. ముఖ్యంగా 11 న ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు గాని సమావేశాలకు గాని అనుమతి లేదని,ఇది గమనించి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏం పీ డీ ఓ సరోజ,లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం తహశీల్దార్లు దిలీప్ కుమార్, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, రోహిత్ దేశ్పాండే, రాజ మనోహర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు స్వరూప్ రాజ్, గోపతి సురేష్, తహసీద్దీన్, అనూష, తిరుపతి, సహాయ వ్యయ పరిశీలకులు, మాస్టర్ ట్రైనర్లు, సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News