ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు ఆడడం వల్ల మానసిక స్థిైర్యంతో పాటు శరీర దారుఢ్యం పెంపొందుతుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి జి.తిరుపతి అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల కళాశాల మైదానం లో గత మూడు రోజులుగా జరుగుతున్న అండర్ 14 -19 అథ్లెటిక్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎం జె పి గురుకులాల జిల్లా సమన్వయకర్త షేరు శ్రీధర్,ప్రిన్సిపల్ సిహెచ్. మంగ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు భవిష్యత్తులో రాణించడానికి క్రీడలు కూడా చాలా అవసరం అన్నారు. విద్యార్థులు మరీ క్రీడలకే ప్రాధాన్యతను ఇవ్వకుండా చదువుపై కూడా దృష్టి సారించినట్లయితే భవిష్యత్తులో తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం ఖాయమన్నారు. ఇంటర్ మరియు 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అండర్ 19 విభాగంలో లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకోగా, అండర్ 14 విభాగంలో జాంగాం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గెలుపొందిన రెండు జట్లకు గురుకులాల కార్యదర్శి తిరుపతి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, ఏటీపీ తిరుమల్, డిప్యూటీ వార్డెన్ వాని, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News