ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం లోప్రకృతి ఒడిలో పరవశించే ఆధ్యాత్మిక కేంద్రం గుంజేడు. ఇక్కడ కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత జాతర నేడు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నాడు ఆదివాసీల ఇలవేల్పుగా వెలసి నేడు అందరి మొక్కులు తీర్చే దేవతగా కొలువు దీరిన మహిమగల తల్లి శ్రీముసలమ్మ దేవత.. నిత్యం భక్తులు కోరిన కోర్కెలు తీర్చి మొక్కులు పొందుతోంది. శ్రీముసలమ్మ జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 4 నుంచి 6 వరకు నిర్వహిస్తున్న ఈ జాతర కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇక్కడి స్థల పురాణం ఎం చెప్పుతుంది... ఈ ప్రాంతం ఏజెన్సీ కావడంతో చుట్టూ దట్టమైన అడవి, పక్కనే సెలయేరు పారుతుంటే చూడటానికి ఆహ్లాదాన్ని అందిస్తూ ఆ దేవత తన్మయత్నంలో మునిగిపోతూ ఆధ్యాత్మికత ను ప్రతిబింబించే విదముగా కొత్తగూడ మండలం గుంజేడులో శ్రీములనమ్మ దేవత వెలసింది. జీవనోపాది కోసం చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన శ్రీముసలమ్మ, తన చెల్లెలు ముత్యాలమ్మ గోదావరి దాటి తమకు అనువైన ప్రాంతం కోసం వెతుకుంటూ వస్తున్న క్రమంలో గుంజేడు ప్రాంతానికి రాగానే దోపిడి దొంగలు వారి నుంచి ధనం, బంగారు దోచుకునేందుకు వెంటపడ్డారు. వారితో శ్రీముసలమ్మ, ముత్యాలమ్మ విరోచ్చితంగా పోరాడుతున్న సమయంలో ముత్యాలమ్మ వీరమరణం పొందగా, శ్రీమునలమ్మ వారి (దోపిడీ దొంగల) నుంచి తప్పించుకునే క్రమంలో గుంజేడు ప్రాంతంలోని గుట్టలోకి వెళుతుంది. చాలాకాలం తరువాత తోలెం వంశీయుల కలలో కనిపించి నేను గుట్టలో కొలువై ఉన్నాను. నన్ను కొలిస్తే మీ కోరికలు తీరుస్తాను.. మీకు సుఖ, సంతోషాలు అందిస్తానుని చెబుతుంది. మరుసటి రోజు వారు వెళ్లి వెతకగా కుంకుమ భరిణి రూపంలో అమ్మవారు కనిపించారు. కుంకుమ భరణను తీసుకువచ్చి గుంజేడు వాగు సమీవంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఆనాటి నుండి నేటి వరకు శ్రీముసలమ్మ దేవత మహిమలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో అన్ని వర్గాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీముసలమ్మ దేవతను కొలుస్తున్నారు. ఈ దేవాలయానికి తోలెం వంశీయులే పూజారులుగా ఉంటున్నారు. ఆలయం పక్కనే శ్రీముసలమ్మ చెల్లెలు ముత్యాలమ్మ తల్లి గుడిని ఏర్పాటు చేశారు. దేవాలయం సమీపంలో ప్రవహించే వాగు నీటిని తీసుకెళ్లి కొందరు ఇళ్లలో చల్లుకుంటారు. రైతులు తీసుకువెళ్లి పొలాలల్లో చల్లుకుంటే పంట మంచి దిగుబడి వస్తుందని చెబుతుంటారు. శ్రీముసలమ్మ జాతర సందర్భంగా గుంజేడు గ్రామంలో మట్టి ఇళ్లను అలికి రంగులు వేసుకుని ముగ్గులు వేసుకుని ముస్తాబు చేసుకుంటారు. మొదటి రోజు సాయంత్రం గుంజేడు గ్రామస్థులు ముత్యాలమ్మ దేవతకు బోనాలు సమర్పిస్తారు. గురువారం పడిగలు పట్టుకుని గుట్టకు వెళ్లి శ్రీముసలమ్మ దేవతను తీసుకువచ్చి గుడిలో ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు శ్రీముసలమ్మను దర్శించుకుంటారు. ముసలమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, మరి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం తరహాలోనే ఇక్కడ కూడా బెల్లాన్ని (బంగారం) నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే తాము పండించిన పంటను కూడా నైవేద్యంగా ఇవ్వడం విశేషం. ఆ సాయంత్రమే శ్రీముసలమ్మ దేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అందంగా ముస్తాబైన దేవాలయం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి ప్రాకారానికి రంగులు వేయించారు. విగ్రహాలకు రంగువేసి ముస్తాబు చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీములసమ్మ దేవతను దర్శించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్ భూర్క సరేందర్, ఈవో అనిల్, పూజారులు తోలెం చిన్న నర్సయ్య, వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న. కిరణ్ కుమార్, తోలెం నవీన్, తోలెం రాంబాబు, స్థానిక సర్పంచ్తోలెంఅనంతరావు కోరుతున్నారు.
Admin
E Nivas News